నూతన సచివాలయానికి వెళుతున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన నూతన సచివాలయానికి వెళుతున్న క్రమంలో టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో తనని సచివాలయంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అవసరమైతే పోలీసులే తనను సచివాలయంలోనికి తీసుకువెళ్లాలని అన్నారు. తను సచివాలయంలోకి వెళితే పోలీసులకు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డును, విమానాశ్రయాన్ని తీసుకు వచ్చింది కాంగ్రెస్ యేనని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి అంచనాల ప్రకారం ఓఆర్ఆర్ లక్ష కోట్ల ఆస్తి అని తెలిపారు. ఏటా ఓఆర్ఆర్ నుంచి సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వస్తుందని.. కానీ ప్రభుత్వం 30 ఏళ్లకు రూ. 7,380 కోట్లకే లీజుకు ఇచ్చారని మండిపడ్డారు.
ఈ ఆదాయం కేవలం ఐదేళ్లలో వస్తుందని.. ఔటర్ రింగ్ రోడ్డు ని కేటీఆర్, కెసిఆర్ లు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఒక దొంగను పట్టుకోవడానికి వెళుతున్న తనను పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక నిన్న జరిగిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం కూడా సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. పెళ్లయిన మొదటి రోజు చేసే హడావిడి నిన్న చేశారని.. అంతే తప్ప సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని ఆరోపించారు.