సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ గడువు మరో నెల పొడిగింపు చేస్తూ.. నిన్న కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. మేడే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. పారిశుధ్య కార్మికుల వేతనం రూ.వెయ్యి పెంచాలని సీఎం నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. జీహెచ్‌ఎంసీ, జలమండలి, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు పెరగనున్నాయి. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు.‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.