మే 10వ తేదీ నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి సారి తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కు 3 లక్షల 20 వేల అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 137 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా తెలంగాణలో 104, ఏపీలో 34 సెంట్లర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సారి ప్రతి సెంటర్లో సిట్టింగ్ అబ్జర్వర్స్ ఉంటారని ఆయన తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులు చూసుకోవాలని ఆదేశించారు. ఈ సారి ఎడ్ సెట్ ఒకే రోజు సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు యూనివర్శిటీ బిల్లు ప్రాసెస్ లో ఉందన్న లింబాద్రి.. అనుమతి వస్తేనే యూనివర్సిటీగా అది చెల్లుబాటు అవుతుందన్నారు. లేకపోతే అది కాలేజీగానే పరిగణించబడుతుందని తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ ఉన్న రూట్లో ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కోరామని ఆయన స్పష్టం చేశారు.