కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్ పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ, మల్లయ్య కూతురు అనూషకు సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో మే 12న వివాహం జరిపించడానికి పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పోసప్పో చేసి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్టజెప్పారు. మే 12 కేశవపట్నంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో వివాహం జరుగుతున్న సమయంలో కట్నంలో భాగంగా తనకు ఇవ్వాల్సి బైక్ ఇవ్వలేదని.. బైక్ కొనిస్తేనే తాళి కడతానని పెళ్లికొడుకు డిమాండ్ చేశాడు.
ఈ సంఘటనను కళ్లారా చూసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పారు. బైక్‌ను తాను కొనిస్తాని హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన రూ. లక్ష నగదును పెళ్లి కొడుకు తండ్రి చేతిలో పెట్టారు. దీంతో పెళ్ళికి అంగీకరించిన వినయ్.. అనూష మేడలో తాళి కట్టారు. రసమయి బాలకిషన్ స్వయంగా దగ్గరుండి పెళ్లి పనులు అన్ని చూసుకుంటూ తోబుట్టువు లాంటి చెల్లెలి పెళ్ళికి కట్నంగా బైక్ కొనిచ్చి తన ఔధార్యాన్ని చాటుకున్నారు. రసమయి ఔదర్యం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.