హైదరాబాద్‌కు మెట్రో వచ్చిన తర్వాత నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయి. గంటలు గంటలు ట్రాఫిక్‌లో ఎదురుచూపు చూసే బాధ తప్పింది. బస్సుల్లో ఇరుగ్గా వెళ్లే ప్రయాణికులు మెట్రోలో హాయిగా ప్రయాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం మెట్రో సేవలు నగరంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెట్రోరైల్ సౌకర్యం తమ ప్రాంతాలకు కావాలంటూ రంగారెడ్డి, మేడ్చల్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థిస్తున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్‌చెరు మార్గాల్లో మెట్రోరైల్ ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
మెట్రోరైల్ కారిడార్ ఎల్బీనగర్-మియాపూర్‌ను రామోజీ ఫిలింసిటీ వరకూ పొడిగించనున్నామని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ మేరకు డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలివ్వాలంటూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు కేటీఆర్‌ను కోరారు. రామోజీ ఫిలింసిటీకి మైట్రోరైల్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా మరింత ఆదాయం వస్తుందని వారు మంత్రికి వివరించారు మరోవైపు కొంగర్‌కలాన్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభమైనందున సాగర్‌రింగ్‌రోడ్డు మీదుగా తుర్కయాంజాల్, ఆదిభట్ల కొంగర కలాన్‌కు మెట్రోరైల్ నడిపించాలని రంగారెడ్డి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలు కోరారు.