ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు హైటెక్ కాపీయింగ్ జరిగిన విషయం తెలిసింది. టీఎస్పీఎస్సీ వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే.. మరో వ్యవహారం బయటపడింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలోనూ స్మార్ట్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైయింది. ఈ కేసులో చింతపల్లి చైతన్య కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ సెంటర్‌లో కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తాను రాసిన జవాబులను ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా తన మిత్రులకు పంపాడు. ఎల్‌బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు. ఈ క్రమంలోనే.. ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్ ఈ బాగోతాన్ని గమనించి ఆ విద్యార్థిని పట్టుకున్నారు. అతణ్ని ప్రశ్నించగా మొత్తం తతంగమంతా బయటపడింది. అనంతరం అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా..మోండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.