భారత్‌లో తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ షురూ చేసింది. ఇవాళ ఉదయం సీబీఐ అధికారుల బృందం బాలాసోర్‌లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన అధికారులు ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను పరిశీలించారు.
నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఘటనపై ఒడిశా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు రావడంతో.. కేంద్ర సర్కార్.. సీబీఐని రంగంలోకి దించింది. ఈ ప్రమాదం ప్రమాదమేనా.. లేక ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్‌లైన్‌కు ఖాయం చేసిన రూటును లూప్ లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు తేల్చి చెప్పారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.