కరోనా నుంచి యావత్ ప్రపంచం బయటపడిన ఉత్తర కొరియా మాత్రం ఇంకా ఆంక్షల వలయంలోనే చిక్కుకుపోయింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ సరిహద్దులను ఇంకా తెరవకపోవడంతో.. ఆ దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. అక్కడి ప్రజలు సరైన తిండిలేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్యాంగ్యాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల ఆకలిచావుల బారిన పడినట్లు స్థానిక మహిళ ఒకరు వెల్లడించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది.
మరో గ్రామంలోనూ ఆకలితో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ గృహ నిర్మాణ కార్మికుడు వాపోయాడు. ఒకప్పుడు కొవిడ్‌తో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డామని.. కానీ, ఇప్పుడు ఆకలి చావులకు వణికిపోతున్నామని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తుండటం.. వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
కొందరు ప్రజలు పొరుగుదేశం నుంచి అక్రమంగా ఆహార పదార్థాలను తరలించేందుకు యత్నించడంతో.. అటువంటి చర్యలకు దిగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. సరిహద్దులు దాటితే.. కాల్చివేయాలని గార్డులకు కూడా ఆదేశాలిచ్చారట.