జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం… నెక్ట్స్ ప్లాన్ ఇదే..!

-

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే రాజకీయంగా అనేక చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వైసిపి ఏకంగా 151 సీట్లు సాధించి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు, పార్టీ అధినేత జగన్ పాలనాపరంగా నాలుగు నెలల్లోనే కనివిని ఎరుగని సంస్కరణలతో పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇతర పార్టీల నేతలు వైసిపి ఖ‌కచ్చితంగా ఏపీలో పదేళ్లపాటు అధికారంలో ఉంటుందన్న అంచనాకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన కీలక నేతలు వైసీపీలోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి రాలేనివారు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైపు చూస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన ఎంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకుందో తెలిసిందే.

జనసేనలో భవిష్యత్తు లేదని డిసైడ్ అయిన ఆ పార్టీ నేతలు అందరూ ఇప్పుడు వరుస పెట్టి వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. ఇక ఆ పార్టీకి మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం పార్టీలో ఇమడలేక పోతున్నారు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నా పవన్ మాత్రం తనకు ప్రయారిటీ ఇవ్వకపోవడం ఆయనకు నచ్చటం లేదు. నాలుగు నెలల్లోనే రాపాక అటు అసెంబ్లీ, ఇటు బయట వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన రాపాక తాజాగా జగన్ కు వైసిపి మంత్రితో కలిసి పాలాభిషేకం చేసి మరో సంచలనం క్రియేట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు జగన్ ప్రభుత్వం ఏటా రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు వైఎస్ఆర్ వాహనమిత్ర పేరుతో పథ‌కాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథ‌కాన్ని ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో ప్రారంభించారు. ఇప్పుడు ఈ పథ‌కానికి మంచి స్పందన వస్తుంది. ఈ పథ‌కాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అభినందించారు.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అయన మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో రాజోలు నియోజకవర్గంలో ఒక్క పని కూడా కావడం లేదని రాపాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ క్రమంలోనే వైసిపికి క్రమక్రమంగా దగ్గరవుతూ జగన్ పై ప్రశంసలు కురిపిస్తుంటే స్థానికంగా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో అవసరాన్నిబట్టి జగన్ ఎప్పుడు ఓకే చెబితే అప్పుడు వైసిపి చెంత చేరాలన్నదే ఆయన ప్లాన్ గా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news