తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేదవాళ్లు కూడా ఆత్మగౌరవంతో బతికేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అనే పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఎంతో మందికి ఇళ్లను పంపిణీ చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ టౌన్‌షిప్‌ను నిర్మించింది. కొల్లూర్ గ్రామంలో 145 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5కోట్ల వ్యయంతో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 117 బ్లాక్‌లు, అందులో జీ+9లో 38, జీ+10లో 24, జీ+11లో 55బ్లాక్‌లుగా నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో డబుల్ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్‌లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు. 12అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు.