టిడిపిలో అందరం కలిసికట్టుగా ఒకే తాటిపై పనిచేస్తామని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు లో టిడిపి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రూరల్ ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… నేను వైసిపి నుంచి దూరమయ్యాక టిడిపిలోకి ఆహ్వానించారని… టిడిపిలో అందరం కలిసికట్టుగా ఒకే తాటిపై పనిచేస్తామని వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. యువ గళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాదయాత్రకు విస్తృతంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక అటు మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు సిటీ..రూరల్ నియోజకవర్గంలో పాదయాత్రకు రూపకల్పన చేస్తున్నామని.. టిడిపి హయాంలో నెల్లూరు నగర అభివృద్ధికి వేల కోట్లు వెచ్చించామని చెప్పారు. 70 శాతం పనులుపూర్తి చేశాం..మిగిలిన పనులు చేయలేక పోయారని.. టిడిపి ప్రభుత్వం లో విమర్శల కంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగ్గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు నారాయణ.