కరీంనగర్లో దారుణం జరిగింది. నగరంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్ చదివే బాలుడితో ఆమె ప్రేమలో పడింది. ఏడాది క్రితం వారిద్దరు సన్నిహితంగా ఉండగా.. బాలుడి స్నేహితులు వారి వీడియోలు చిత్రీకరించారు. అనంతరం బాలికకు అవి చూపించి.. తన తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి ఇద్దరు స్నేహితులు..ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల మరో ముగ్గురు స్నేహితులు కూడా ఇదే కారణంగా బెదిరించి లొంగదీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె షీటీమ్ను ఆశ్రయించింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. కేసు నమోదైన ఆరుగురిలో ఐదుగురు ఇంటర్ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్ అని, అతను పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని వెల్లడించారు.