మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రా రెడ్డి ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. రామచంద్రా రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన రాజకీయ జీవితంలో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.
సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ సామాజిక రంగాల్లో ఆయన ఆచరించిన కార్యాచరణ.. ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందని సీఎం కేసీఆర్ రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలితరం ప్రజానేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మృతిపై పలువురు మంత్రులు, నేతలు సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ సాయంత్రం రామచంద్రారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.