120 రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ఎలా ముందుకు సాగాలనే అంశంపై తాము చర్చించామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకులతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ భేటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగిందన్నారు. పదేళ్ల టీఆర్ఎస్ వైఫల్యాలను, కేంద్రంలోని మోదీ అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు ఎలా వివరించాలో ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు.
పది సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగి పోయిందని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చర్చ జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకు సిద్ధం అయ్యామని, తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలయిందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో ఏ ఫార్ములాతో ఎలా అధికారం ఏర్పాటు చేశామో.. అలాంటి మౌలిక సూత్రాలు తెలంగాణలో ఫాలో అవుతామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల సన్నాహలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై చర్చించామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించి ఎలా విజయం సాధించాలనే విషయంపై చర్చించామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.