ఫ్రాన్స్ దేశం తగలబడుతోంది. రోజురోజుకు అల్లర్లు ఆ దేశమంతా విస్తరిస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని నాంటెర్రి ప్రాంతంలో నహేల్ అనే 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటనతో మొదలైన నిరసనలు అంతకంతకూ హింసాత్మకంగా మారుతున్నాయి. ఫ్రాన్స్ నగరాలు అగ్ని గుండంలా మారాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకొంటూ అడ్డుకుంటున్న వారిపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు, చెత్త డబ్బాలను తగుల బెడుతున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. 2 వేల 500 ప్రాంతాల్లో నిరసనకారులు నిప్పుపెట్టారు. యథేచ్చగా లూటీలకు పాల్పడుతున్నారు. పారిస్‌లోని మూసి ఉన్న దుకాణాల తలుపులు తెరిచి లూటీ చేసేందుకు ఆందోళనకారులు యత్నించారు.
ఫ్రాన్స్ అంతటా వ్యాపిస్తున్న అల్లర్లను అణచివేసే క్రమంలో యువకులను ఇంట్లోనే ఉంచి తోడ్పడాలని అధ్యక్షుడు మేక్రాన్ వారి తల్లిదండ్రులను కోరారు. దేశంలో అల్లర్లను సామాజిక మాధ్యమాలే ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనలకు ప్రేరణ కలిగిస్తున్న సామాజిక మాధ్యమ వేదికలైన స్నాప్ చాట్, టిక్‌టాక్ వంటివి సున్నిత అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని కోరారు.