ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభను అడ్డుకునేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తుందని ఆ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, రేణుక చౌదరి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వి హనుమంతరావు తదితర నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పోలీసులు, ఆర్టిఏ అధికారులతో కలిసి ఖమ్మం సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలపై తాజాగా స్పందించారు ఖమ్మం సిపి విష్ణు వారియర్. కాంగ్రెస్ సభకు ఎటువంటి ఆటంకాలు కలిగించడం లేదని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాలు ఆపడం లేదని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు. పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభకు వెళ్లే ప్రైవేట్ వాహనాలను తనిఖీల పేరిట ఆపి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేసే ఆరోపణలలో ఎటువంటి నిజం లేదన్నారు.