ఖమ్మంలో నిర్వహిస్తోన్న జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, పలువురు నేతలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల పోరాటంతో సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చినా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2018లో రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు రుణమాఫీ లేదని ఆయన మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలన్నీ నెరవేర్చుతామని పొంగులేటి హామీ ఇచ్చారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోతుందని తెలిసినా ఇచ్చారని పొంగులేటి అన్నారు. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. డిక్లరేషన్‌లో ప్రకటించినవన్నీ కాంగ్రెస్ చేస్తుందని ఆయన వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలపడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.