పశ్చిమ బెంగాల్లో ఇవాళ 697 కేంద్రాల్లో పంచాయతీ ఎన్నికల రీపోలింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకున్న హింస, అక్రమాలను నిరసిస్తూ విపక్ష పార్టీలు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 15 మంది దుర్మరణం చెందారు.
మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో హింసపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ ఆదివారం దిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు ఓ అధికారి తెలిపారు. హింస, ఓటింగ్‌లో అక్రమాల కారణంగా పోలింగ్‌పై ప్రభావం పడిన 19 జిల్లాల్లోని 697 బూత్‌లలో ఇవాళ రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
రీపోలింగ్‌లో హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ఈసీ చర్యలు చేపట్టింది. ఆయా కేంద్రాల వద్ద రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలకు చెందిన సిబ్బంది నలుగురు చొప్పున భద్రతా విధుల్లో ఉంచింది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఇవాళ పంచాయతీ ఎన్నికల రీ పోలింగ్ జరగనుందని వెల్లడించింది.