బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో తమ పార్టీని చేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి జగన్ ప్రాధేయపడింది నిజం కాదా? అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ప్రధానమంత్రి గారిని ఎంతగా ప్రాధేయపడినా ఎన్డీఏ కూటమిలో తమ పార్టీని చేర్చుకునేది లేదని ఛీ… పొమ్మనలేదా?? అంటూ నిలదీశారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్డీఏ కూటమి తమ పార్టీని దగ్గరకు రానివ్వదని, ఎందుకంటే ప్రజల్లో ఎంతో చెడ్డ పేరు ఉన్న పార్టీని ఎవరు చేరదీయరని తెలిపారు.
రేపు బిల్లుల కోసం వాడుకుంటున్నారు తప్ప, మనల్ని దగ్గరకు రానివ్వరని, గజ్జి కుక్కను చూసినట్లు మన పార్టీని చూస్తారన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి తెలుగుదేశం పార్టీని పిలువక పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని, టీడీపీ ఈ సమావేశానికి హాజరు కానంత మాత్రాన, ఎన్డీఏ కూటమి నుంచి ఆహ్వానం అందలేదని అనుకోవడం మన అజ్ఞానాన్ని, అవివేకాన్ని తెలియజేస్తుందన్నారు. అంతకు ముందు తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణ రాజు గారు స్పందిస్తూ… అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. 2024 లో తమ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని గోడ మీద పిల్లి వాటంలా ఎవరు వ్యవహరిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే ఆయన సంకలో చేరేందుకు సిద్ధమయ్యారని, మళ్లీ కేంద్రంలో మోడీ ప్రభుత్వమే ఏర్పడితే ఆయన సంకనెక్కాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రెండు నుంచి మూడు స్థానాలను గెలువలేని తమ పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడమా?, ఆశ్చర్యం కాకపోతే అంటూ అపహాస్యం చేశారు. ఆ రెండు, మూడు స్థానాలు గెలిచేది కూడా డౌటేనని, కడప స్థానం కూడా కైవసం చేసుకోవడం కష్టమేనని, అంత మాత్రానికి ఎందుకు ఈ వెధవ బిల్డప్ లు అంటూ ఎద్దేవా చేశారు.