ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఉండేలా టీడీపీ అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన నివాసంలో దాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో అనుకూలంగా మార్చుకునే విధానాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్‌ఛార్జ్ వరకూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేలా రూపొందించిన కార్యాచరణను నేతల ముందు ఆవిష్కరించారు.
ఇప్పటికే ప్రజల కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో శక్తిమంతమైన మేనిఫెస్టోను రూపొందించిన చంద్రబాబు… ఇప్పుడు పార్టీలోని కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. దీనికి సంబంధించిన కార్యాచరణపైనే ఇవాళ్టి సమావేశంలో చర్చించారు. ఇందులో బూత్ స్థాయి ఇన్చార్జి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుంది. బూత్ స్థాయి నుంచి వివిధ దశల ఇన్చార్జిలకు ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ ఇచ్చేలా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీల సాయంతో గత మూడు ఎన్నికలకు సంబంధించిన డేటాను పరిశీలించి, నియోజకవర్గంలో ఈసారి ఏం చేయాలనే దానిపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని నియోజకవర్గ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.