దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం రోజున ఇస్తాంబుల్‌కు వెళ్లే విమానం ఎక్కేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా.. వారిని టెర్మినల్ 3 వద్ద కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి వారి లగేజీని తనిఖీ చేయగా.. అందులో ఉన్న బూట్లలో దాచిపెట్టిన విదేశీ కరెన్సీని గుర్తించారు. అనంతరం వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసి.. మొత్తం 7,20,000 అమెరికా డాలర్లు, 4,66,200 యూరోలను స్వాధీనం చేసుకున్నారు.
భారత కరెన్సీలో వీటి విలువ దాదాపు రూ.10.6 కోట్లకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అంతపెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ వారికి ఎలా చేరిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. వారు ముగ్గురు తజికిస్థాన్‌కు చెందిన వారని అధికారులు వెల్లడించారు. వారిలో ఒక బాలుడు ఉన్నాడని చెప్పారు. ఇప్పటి వరకూ భారత విమానాశ్రయాల్లో ఇంత భారీ మొత్తంలో పట్టుకున్న విదేశీ కరెన్సీ ఇదేనని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.