భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. దేశీయంగా బియ్యం సరఫరా పెంచి.. చిల్లరధరలను అదుపు చేసేందుకు బాస్మతీయేతర బియ్యం ఎగమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధరలు పెరుగుతాయన్న భయంతో బియ్యంకోసం ఎన్‌ఆర్‌ఐలు దుకాణాల ముందు బారులు తీరుతుండటం వల్ల కొనుగోళ్లపై పరిమితి విధించారు. బియ్యం కోసం ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇళ్లకు తిరిగి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని వినియోగదారులు అంటున్నారు. బియ్యం ధరలు సాధారణం కంటే 3 రెట్లు పెరిగినట్లు చెబుతున్నారు.
మరోవైపు భారత్ విధించిన నిషేధం.. అమెరికాలో పెద్ద మొత్తంలో బియ్యం సరఫరా చేసే వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. వాషింగ్టన్, మేరీలాండ్, వర్జినియాలో వందలకొద్దీ రిటైల్ స్టోర్స్, రెస్టారెంట్లకు బియ్యం సరఫరా చేసే మేరిలాండ్‌లోని బియ్యం కంపెనీకి పొరుగు రాష్ట్రాలైన న్యూజెర్సీ సహా ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు పెరిగాయి. భారత్ నిషేధం విధించిందన్న వార్తలతో బియ్యానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగినట్లు బాల్టిమోర్‌కు చెందిన బియ్యం టోకు వ్యాపారి ఒకరు తెలిపారు. వారాంతాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.