సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, వరద నష్టపరిహారం డిమాండ్లతో సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొంతమంది కాంగ్రెస్ నేతలను ముందస్తుగానే అరెస్టులు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అక్రమ అరెస్టులతో ఆందోళనను అడ్డుకోలేరని అన్నారు డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి.