Telangana : తెలంగాణ రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి దరఖాస్తుల నమోదులో సరికొత్త రికార్డు నమోదయింది. నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా…. లైసెన్సుల కోసం తొలిసారి 1.25 లక్షలకు పైగా అప్లికేషన్లు అందాయని అబ్కారి శాఖ పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,500 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. చివరి రెండు రోజుల్లోనే 55 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. గత టెండర్ల సమయంలో మొత్తం 79 వేల దరఖాస్తులు వచ్చాయి.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు తిరిగి ఇవ్వని నగదు చలాన్ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించనున్నారు. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద ఉన్నట్లు స్పష్టం చేసింది.