చావు, పుట్టుకలు మనిషికి ఒక్కసారి మాత్రమే వస్తాయి. పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. దీన్ని ఎవరూ దాటవేయలేరు. అయితే చనిపోయిన తర్వాత వారి వారి మతాలకు తగ్గట్టుగా కాల్చడమో, పూడ్చడమో చేస్తుంటారు. మరణించకుండానే సమాధి చేస్తే.. అదేంటి అలా ఎందుకు చేస్తారు అనుకుంటున్నారా..? ఈ మధ్య కొన్ని ఘటనలు చూసే ఉంటారు. చనిపోయారు అనుకోని అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుంటే అప్పుడు లేస్తారు. కానీ ఇది మరీ ఇంకో స్టెప్ ముందుకు వెళ్లారు. సమాది కూడా చేశారు.. 11 రోజుల తర్వాత ఏం జరిగిందంటే..
బ్రెజిల్ కు చెందిన 37 ఏళ్ల రొసాంజెలా అల్మెయిడా డాస్ శాంటోస్ అనే మహిళకు రెండుసార్లు గుండెపోటు రావడంతో మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆమె మృతదేహాన్ని ఈశాన్య బ్రెజిల్‌లోని రిచాన్ దాస్ నెవ్స్‌లో ఖననం చేశారు. అయితే శ్మశానవాటిక నుంచి ప్రతిరోజూ అరుపులు వినిపించడంతో చుట్టుపక్కల వారు బహుశా దెయ్యం అని భయపడి చాలా రోజులుగా ఎవరూ అటువైపు వెళ్లలేదట. కానీ ఒక రాత్రి ఎవరో సమాధి నుంచి సహాయం అడుగుతున్నట్లు స్పష్టంగా అనిపించింది. దీంతో చుట్టుపక్కల వాళ్లు ఈ సమాచారం శ్మశానవాటిక యాజమాన్యానికి తెలియజేయగా ఇటీవల పూడ్చిన సమాధులను పరిశీలించారు. రోసంజెలా సమాధి తెరవగానే అందరూ ఆశ్చర్యపోయారు.
రోసంజెలా సమాధిలో పదకొండు రోజులు బతికే ఉంది. బయటకు రావడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించినట్లు తేలింది. ఆమె ముక్కు మరియు చెవులలో చొప్పించిన కాటన్ బాల్స్ బయటకు వచ్చేశాయి. సమాధి లోపల గోరు గుర్తులు ఉన్నాయి. సమాధి లోపల రోసంజెలా రక్తం కూడా ఉంది. పదకొండు రాత్రులు రోసంజెలా బయటికి రావాలని ఏడుస్తూనే ఉంది. అయితే దెయ్యం అనుకుని ఎవరూ సాయం చేయలేదు. చివరకు సమాధిని తెరిచినప్పుడు, ఆమె అప్పటికే చనిపోయి ఉంది. ఆ సమయంలో ఆమె శరీరం వేడిగా ఉంది. అంటే, సమాధి తెరవడానికి కొద్దిసేపటి ముందే ఆమె మరణించింది. సమాధిలో మొత్తం పదకొండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది రొసాంజెలా. అయితే ఈ ఘటన 2018లో జరిగినా ఇప్పుడు వైరల్ అవుతోంది.