మంత్రి హరీశ్‌రావు పట్ల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ట్వీట్ చేశారు. తెలంగాణ పట్ల సీనియర్ నాయకులు హరీశ్ రావు నిబద్ధత, బీఆర్ఎస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు అనిర్వచనీయమైనవన్నారు. హరీశ్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మైనంపల్లిపై బీఆర్ఎస్ అధిష్ఠానం చర్యలకు సిద్ధమవుతోన్నట్లుగా తెలుస్తోంది. హరీశ్ రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ పెద్దలు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఏ సమయంలో అయినా నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. మైనంపల్లి హనుమంత రావు.. మంత్రి హరీశ్ రావుపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ గట్టిగానే స్పందించారు. ఈరోజు తిరుపతిలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హనుమంతరావు చేసిన సంచలన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తన కుటుంబసభ్యుడికి టికెట్ నిరాకరించిన సందర్భంగా.. మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీశ్ రావుపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను, ఎమ్మెల్యే ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టారు కేటీఆర్. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి హరీశ్ రావు.. ఒక సమగ్ర వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీకి ఒక మూల స్తంభంగా కొనసాగుతున్న హరీశ్ రావును బీఆర్ఎస్ శ్రేణులు అందరూ అండగా ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.