టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ఉన్న పోలవరం నియోజకవర్గంలోకి ఈ రోజు పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న లోకేష్ వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. పోలవరం నిర్వాసితుల కోసం తమ ప్రభుత్వ హయాంలో 4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని లోకేష్ అన్నారు. అంతేకాదు, తమ పాలనలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 72 శాతం పనులను పూర్తి చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉందని తెలిపారు.
45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు తెలంగాణ నుంచి ముంపు మండలాలను మోదీ గారి సహకారంతో విలీనం చేసుకున్నాం. ఇప్పుడు టీడీపీ లక్ష్యం ఏంటంటే… నిర్దేశించిన ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందజేయడం, నిర్వాసితులకు మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలు నిర్మించడం. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పక నెరవేరుస్తామని వీటన్నింటిపై ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా” అని లోకేశ్ తెలిపారు.