మరోసారి విపక్షాలపై విమర్శలు గుప్పించారు రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇవాళ ఆమె మహేశ్వరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలను నమ్మితే మళ్లీ గోసపడుతామని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎట్లుండే. ఇప్పుడెట్ల ఉందోనన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఆమె సూచించారు. రాజకీయ సుస్థిరత , శాంతిభద్రతలు ఇచ్చే నాయకుడు కేసీఆర్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు.
కాబట్టే మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో వెలుగులు విరజిమ్ముతుందని వెల్లడించారు. మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్ లు, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి తదితర కార్యక్రమాలతో నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.
రానున్న కాలంలో పెరుగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టకొని విజన్‌తో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఎల్బీనగర్ ప్రాంతంలోని ప్రజల కోసం గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో రూ.1200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోనే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.