మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక దందాతో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. జేపీ సంస్థ ముసుగులో వైఎస్ జగన్ అక్రమ ఇసుక దందా నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఇసుకదందాతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. జేపీ వెంచర్స్‌తో ఒప్పందం ముగిసినా… జీఎస్టీ నెంబర్ సస్పెండ్ అయినప్పటికీ ఇప్పటికీ అదే కంపెనీ పేరుతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాలుగేళ్లలో 40 కోట్ల టన్నుల ఇసుకతవ్వి రూ. 40 వేల కోట్లు దోచేశారన్నారు దేవినేని ఉమా.
వైఎస్ జగన్ ఇసుకాసురుడిగా మారారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను అందిస్తే.. వైసీపీ ప్రభుత్వం అయితే సామాన్యుడికి ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని మండిపడ్డారు. నిల్వ ఉంచిన అక్రమ ఇసుకకు పర్మిషన్, స్టాకు నిల్వలపై రికార్డులు చూపాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని నిరసిస్తూ మంగళవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ఇతర నేతలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, ఎన్‌జీటీ విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా ఇసుకను తవ్వేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ప్రధాన కార్యాలయం ముట్టడి జరుగుతుందని ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొనాలని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు.