చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోందని ఇస్రో ప్రకటించింది. రోవర్లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద సల్ఫర్ ఉనికిని తొలిసారి గుర్తించినట్లు తెలిపింది. ఈ క్రమంలో చంద్రుడిపై ఆక్సిజన్ (Oxygen) ఆనవాళ్లను గుర్తించినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. అల్యూమినియం(AI), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం(Cr), టైటానియం (Ti), మాంగనీస్ (Mn), సిలికాన్(Si)తోపాటు ఆక్సిజన్ (O)ను కూడా కనుగొన్నట్లు పేర్కొంది.
హైడ్రోజన్ కోసం శోధన జరుగుతోందని ట్వీట్ చేసింది. ప్రజ్ఞాన్ రోవర్‌లోని లిబ్స్ పరికరాన్ని బెంగళూరుకు చెందిన ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. కాగా, చంద్రుడి ఉపరితలానికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని సమాచారాన్ని ప్రజ్ఞాన్ రోవర్ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఓ ప్రమాదం నుంచి రోవర్ త్రుటిలో తప్పించుకుంది. ఇస్రో (ISRO) అప్రమత్తం చేయడంతో 4 మీటర్ల లోతైన గుంతలో (Creta) పడే ముప్పు నుంచి బయటపడింది. భూ కేంద్రం నుంచి అందిన సూచనలతో తన దిశను మార్చుకుని సురక్షిత మార్గంలో ప్రయాణం మొదలుపెట్టింది. దీంతో రోవర్ ప్రయాణం సాఫీగా సాగుతోంది.