మొన్నటిదాక కొండెక్కిన కూరగాయల ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. నెలన్నర రోజుల క్రితం కిలో రూ.200 ఉన్న టమాటా ధర… ఇప్పుడు తెలంగాణలోని రైతు బజార్లలో రూ.15 ఉంది. బహిరంగ మార్కెట్లలో రూ.20, మాల్స్‌లో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి ధర గతంలో రూ.200 దాటగా.. ఇప్పుడు రైతుబజార్లలో కిలో రూ.25కి లభిస్తోంది.
పంటలు చేతికిరావడంతో పాటు మార్కెట్లకు సరకు పోటెత్తడంతో కూరగాయలు మళ్లీ చౌకగా దొరుకుతున్నాయి. కూరగాయల ధరలు దిగిరావడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దాదాపు రెండు నెలలకు పైగా టమాట ఊసే ఎత్తని ఇండ్లు ఇప్పుడు టమాట వెరైటీ కూరలతో ఘుమఘుమలాడుతున్నాయి.
వేసవిలో అకాల వర్షాలు, ఆ తర్వాత జూన్ నెలలో వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో జూన్ రెండోవారం నుంచి రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రైతు బజార్లలో వంకాయ కిలో రూ.18, బెండ రూ.23, బీర రూ.18, కాకర రూ.23, దొండ రూ.18, బీన్స్ రూ.35, కాలిఫ్లవర్ రూ.18, ఉల్లి రూ.21, క్యాబేజీ రూ.13, ఆలుగడ్డ రూ.21, కీర రూ.13 చొప్పున లభిస్తున్నాయి.