భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ అధ్యక్షతన జీ20 విస్తరణ జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ కు జీ20లో శాశ్వత సభ్యత్వం ఇస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రతిపాదనకు సభ్యులందరి ఆమోదం లభించింది. నేడు భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించగా.. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత ప్రధాని మోడీ యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని జీ20 హై టేబుల్‌లో కూర్చోవాలని ఆహ్వానించారు. ఆనందోత్సాహాలు, చప్పట్ల మధ్య, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అసోమానీని తన సీటుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రధాని మోడీ, అసోమానీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
“మీ అందరి మద్దతుతో ఆఫ్రికన్ యూనియన్‌ను G20లో చేరాలని ఆహ్వానిస్తున్నాను” అని G20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ అన్నారు. గ్లోబల్ సౌత్‌లోని ఈ కీలక కూటమిని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల ఎలైట్ గ్రూప్‌కి తీసుకురావాలనే ప్రతిపాదనకు మంచి స్పందన లభించింది. దీంతో 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆఫ్రికన్ యూనియన్ జీ20 సభ్యత్వం కోసం భారత్ చాలా కాలంగా ఒత్తిడి చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఆఫ్రికన్ యూనియన్‌ను గ్రూపింగ్‌లో శాశ్వత సభ్యుడిగా చేయాలని కోరుతూ ప్రధాని మోదీ జీ20 నేతలకు లేఖ రాశారు. ఆఫ్రికన్ యూనియన్ అనేది ఆఫ్రికన్ ఖండంలోని దేశాలను రూపొందించే 55 సభ్య దేశాలతో కూడిన ప్రభావవంతమైన సంస్థ. దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన ఏయూ ఇందులో చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి మరింత చేరువైనట్లైంది. జీ20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి కేవలం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్యదేశంగా ఉంది. కానీ, ఇప్పుడు భారత్ చొరవ, సభ్యదేశాల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని పొందింది.