ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లను వరుణుడు వెంటాడుతున్నాడు. కొన్నిరోజుల కిందట భారత్, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పుడు సూపర్-4 దశలోనూ ఈ రెండు జట్లు తలపడగా, వర్షం మరోసారి ప్రత్యక్షమైంది. టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తరు వర్షం పడడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.
వాన వల్ల ఆట నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది భారత జట్టు. కెఎల్ రాహుల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 8 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, శుభారంభం అందించారు. అయితే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయ్యారు.
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం ఫీల్డింగ్ తీసుకున్నాడు. సెప్టెంబర్ 2 న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన గిల్, రోహిత్ పట్టుదలగా ఆడారు. ముఖ్యంగా ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రీదీని టార్గెట్ చేసిన గిల్ 5వ ఓవర్లో ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత నసీం షా వేసిన 9వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో, 15 ఓవర్లకు ఇండియా స్కోర్ 115కి చేరింది.