టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో బిజెపికి ఎటువంటి సంబంధం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గురువారం రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు పవన్ కళ్యాణ్. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో చర్చలు జరిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదని.. చంద్రబాబుకు జైలులో మరింత భద్రత కావాలని అభిప్రాయపడ్డారు.
ఈ విషయాన్ని తాను ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. తాను ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా జగన్ పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఎందుకంటే ఆయనకు జగన్ గురించి ముందే తెలుసని అన్నారు పవన్ కళ్యాణ్. దేశాన్ని నడిపే వ్యక్తికి ఇలాంటి విషయాలు ముందే తెలుసని అన్నారు. రాష్ట్రంలో దోపిడీ, అరాచకంపై మోడీకి అవగాహన ఉందన్నారు.
జగన్ సరిగ్గా రాష్ట్రాన్ని పాలిస్తే తాను హ్యాట్సాఫ్ చెప్పేవాడినన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పొత్తులపై సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో టిడిపి తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. రేపు టిడిపి, జనసేన నేతలతో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. భేటిలో జాయింట్ యాక్షన్ రూపొందించి వైసిపి ప్రభుత్వం పై ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు.