స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేశాకే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృథా చేస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుందని ఆయన విమర్శించారు. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలన్నారు. స్కామ్లో వాస్తవాలు తెలుసు కాబట్టే టీడీపీ నేతలు పారిపోతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. స్కిల్ స్కామ్లో ఎంత అవినీతి జరిగిందో.. ఎలా జరిగిందో తాము సభలో చెప్పామన్నారు.
టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పొచ్చుగా అంటూ పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటే దొరికిపోతాం అని టీడీపీ భయపడుతుందని మంత్రి చెప్పారు. తప్పు చేశారు కాబట్టే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిందని ఆయన తెలిపారు. సీమెన్స్ ఒప్పందం ప్రకారం నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయినా కూడా ఏకపక్షంగా కేసులు ఎత్తి వేయాలని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు మీద చర్చకు రమ్మని తాము కోరితే రావడం లేదని అన్నారు. సభ నుంచి వారు ఎందుకు పారిపోయారని మంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము పూర్తి వివరాలతో వివరించామని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్క దారి పడతాయని ప్రశ్నించారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గు తేల్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.