సిద్ధిపేట ప్రజల దశాబ్ధాల కల నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. సొంత గడ్డపై రైలు ఎక్కాలన్న ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం రానే వచ్చేసింది. మంగళవారం (రేపు) నుంచి సికింద్రాబాద్ – సిద్ధిపేట మధ్య తొలి రైలు కూత పెట్టనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ – కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రహదారిలో కీలక మైలురాయి మంగళవారం ప్రారంభం కానుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్ పుల్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. రెండు ప్యాసింజర్ రైళ్లు రేపటి నుంచి సికింద్రాబాద్, సిద్ధిపేటల మధ్య పరుగులు పెట్టనున్నాయి. నిజానికి తొలుత కాచిగూడ – సిద్ధిపేట మధ్య రైలును నడిపించాలని భావించారు.
అక్టోబర్ 3వ తేదీ నుంచి సిద్దిపేట- నుంచి -సికింద్రాబాద్ మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే సిద్దిపేట నుంచి తొలుత కాచిగూడకు రైలును నడిపించాలని భావించారు. కానీ సికింద్రాబాద్ నుంచే ప్రజలు సిద్దిపేటకు వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభిస్తున్నారు. 07483 నెంబర్ గల ప్యాసింజర్ రైలు..సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్లో 07484 నెంబర్ గల రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి..సాయంత్రం 5.10గంటలకు సికింద్రాబాద్కు చేరనుంది. సాయంత్రం 5.45 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరనున్న రైలు.. సిద్ధిపేటకు రాత్రి 8.40 గంటలకి చేరుకుటుంది.