ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గట్టి సంకల్పంతో బిఆర్ఎస్ తొలి అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల్లో ప్రచారానికి తెరతీసింది. కానీ అదే ఇప్పుడు బిఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. అభ్యర్థుల జాబితా ప్రకటించి నెల రోజులు అవుతున్నా అసమ్మతినేతలు మాత్రం రోజురోజుకు పెరుగుతూ వస్తున్నారు. సిట్టింగ్ లకు స్థానాలు ఇవ్వడంతో అక్కడ వారిపై వ్యతిరేకత ఉన్న కేడర్ మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ నిరసనలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఆందోల్ నియోజకవర్గం తప్ప అన్నిచోట్ల అభ్యర్థిని మార్చాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి టికెట్ ఆశించిన వారు వేరే పార్టీకి వెళ్ళి పోటీ చేస్తామని, లేదా రెబల్ గా పోటీ చేసి విజయం సాధించగలమని దీమాను వ్యక్తం చేస్తున్నారట. పటాన్ చెరు లో మహిపాల్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వటంతో, అప్పటివరకు టికెట్ తనకే వస్తుందని ధీమాతో ఉన్న నీలం మధు వర్గం నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకునే నీలం మధు తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
జహీరాబాద్ లో మాణిక్యరావు పై సొంత క్యాడర్ పట్టించుకోరని తీవ్ర వ్యతిరేకత ఉంది. అయినా అతనికి టికెట్ ఇవ్వడంతో బిఆర్ఎస్ కార్యకర్తలంతా అవాక్కయ్యారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వగా అప్పటివరకు ఆ స్థానం వస్తుంది అని ఆశించిన మామిడి రాజు బిజెపిలో చేరగా, మాణిక్యం అసమ్మతినేతగా పార్టీలోనే ఉంటూ చింతా ప్రభాకర్ రెడ్డి ఓటమికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వగా అక్కడి టికెట్ ఆశించిన ఆశావహులు రహస్యంగా కాంగ్రెస్ తో అతనిని ఓడించాలని మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వసంత్ అయితే ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని, అధిష్టానం మనసు మారాలని మూడు రోజులు భజన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి పార్టీలో చేరిన ఏర్పుల నరోత్తంకి టికెట్ ఇవ్వకుండా ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని ఇచ్చి సముదాయించారు. మరి ఈ నిరసనలను ఆపడానికి ఆశావహుల ఆశలను అధిష్టానం ఏ విధంగా తీరుస్తుందో వేచి చూడాలి.