మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నాడు ప్రజలందరి అభిప్రాయంతో వారి అభీష్టంతో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన చంద్రబాబునాయుడు, ఆ మహానగరం నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ లో రాజధాని ప్రాంతంలో ఎలాంటి రవాణా సమస్యలు రాకూడదని భావించి, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలనే ఆలోచన చేశారని వెల్లడించారు బొండా ఉమ.
తర్వాత కాలంలో అది కేవలం కాగితాలకే పరిమితమైందని, అలాంటి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పసలేని ఆరోపణలు చేస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బొండా ఉమ విలేకరులతో మాట్లాడారు.
జగన్ రెడ్డి, అతని నీతిమాలిన ప్రభుత్వం… వేయని ఇన్నర్ రింగ్ రోడ్ గురించి నోటికొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను హెరిటేజ్ సంస్థ భూముల కోసం మార్చారని, లోకేశ్ ఈ వ్యవహారంలో ప్రధాన భూమిక పోషించాడని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అదంతా పచ్చి అబద్ధం.
హెరిటేజ్ సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఎప్పుడో 2014లో అమరావతి ప్రాంతంలోని కంతేరులో 9.17 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. భూములు కొనే సమయానికి అప్పుడు రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన నిర్ణయం హెరిటేజ్ సంస్థ బోర్డ్ మీటింగ్ లో తీసుకుంది.