చైనాలోని హాంగ్ఝౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటివరకూ భారత్ 64(15 గోల్డ్, 20 సిల్వర్, 29 బ్రాంజ్ ) పతకాలతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. ఈనెల 28 వరకు టోర్నీ జరగనుండగా మరిన్ని పతకాలు ఖాతాలో చేరే అవకాశం ఉంది. కాగా 2018పారా ఒలింపిక్స్లో 190 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్.. మొత్తంగా 72 మెడల్స్ సాధించింది. ఈసారి ఆ రికార్డ్ బద్దలు కావొచ్చు. భారతదేశానికి చెందిన అంకుర్ ధామా 2023 ఆసియా పారా గేమ్స్‌లో రెండవ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల 1500 మీటర్ల టి11 ఫైనల్‌లో అంకుర్ మొదటి స్థానంలో నిలిచాడు.
అంతకుముందు రోజు, పురుషుల జావెలిన్ ఎఫ్64 విభాగంలో సుమిత్ యాంటిల్ బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో భారతదేశం మెడల్స్ వేటలో వేగాన్ని పెంచినట్లయ్యింది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో హానీ స్వర్ణం సాధించింది. కాగా.. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో భారత బృందం అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే ఇండియా 35 పతకాలు సాధించి ఔరా అనిపిస్తోంది. ఆసియా పారా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో వుండగా.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. త్వరలోనే టాప్ 3కి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.