హార్స్ పవర్ అంటే కనీస జ్ఞానం లేని వ్యక్తి టీపీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గానికి చెందిన పలువురు ఇతర పార్టీల నాయకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. హార్స్ పవర్ అంటే కనీస జ్ఞానం లేని వ్యక్తి అని.. వ్యవసాయం పై అవగాహన లేని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పీసీసీగా నియమించుకుందని తెలిపారు.
మోటారు 5 హార్స్ పవర్, 7.5 హార్స్ పవర్ ఉంటుంది. 10 హార్స్ పవర్ అస్సలు ఉండదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. పెట్టుబడి, ఎరువు, నీళ్లు, కరెంట్ కష్టాలు లేకుండా సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ హామీలను మరోసారి నమ్మితే నట్టేట మోసపోతారు. తండ్రి లాంటి వయస్సు ఉన్న కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఇచ్చే నేతలు కావాలి. రాష్ట్రానికి కావాల్సింది బూతులు మాట్లాడే నేతలు కాదు.. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొంటుంది. కరెంట్ పై కాంగ్రెస్ తప్పు మీద తప్పు చేస్తుంది. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ అంటున్నారు. కర్ణాటకలో ఎటు చూసినా కరువే కనిపిస్తోంది.