కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన కామారెడ్డి జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావ్? అని తనను అందరూ అడుగుతున్నారని, అయితే మీకు అండగా ఉండేందుకే ఇక్కడకు వచ్చానన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్లో కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. యువకులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. ఉద్యోగాలు రావనే భయంతో యువత అడవిబాట పట్టే అవకాశముందని పేర్కొన్నారు. కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయని.. కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ’’ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదు.ఏపీలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బందవుతుందని ప్రచారం చేస్తుంది. ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తాం. ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తాం. విద్యార్థుల చదువుల కోసం రూ.5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తాం. కాంగ్రెస్ గెలవకుంటే ఉద్యోగాలు రావనే భయంతో యువత అడవి బాట పట్టే అవకాశముంది.’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.