దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను జగన్ సర్కార్ వదలడం లేదు. చింతమనేనిపై కేసులు నమోదు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆయన 18 కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ ..
ఈ నెల 16న బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే విడుదల అనంతరం ఆయన జిల్లా జైలు నుంచి ర్యాలీగా దుగ్గిరాలలోని తన ఇంటికి చేరుకున్నారు. జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉండడంతో త్రీ టౌన్ సీఐ ఎంఆర్‌ఎల్ ఎస్‌ఎస్ మూర్తి తన సిబ్బందితో శనివారపు పేటలో గస్తీ నిర్వహిస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా ప్రజల శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కల్పించారని పేర్కొంటూ చింతమేననిపై ఏలూరుత్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో నేతల రవి, చలమోల అశోక్‌గౌడ్, దాసరి ఆంజనేయులు, వేంపాటి ప్రసాద్, మరికొందరు ఉన్నారు. చింతమనేని పోలీసుల విధులకు ఆటంకం కల్పించారని, పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంగించారని కేసు వివరాల్లో పేర్కొనడం గమనార్హం.
గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి చింతమనేనిపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిత్యం ఆయన వార్తల్లో నానుతూ వచ్చారు. ఈక్రమంలోనే ఆయన వైసీపీ శ్రేణులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం రావడమే ఆయనపై కేసులను లేవనెత్తిందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. 16వ తేదీన ఆయన విడుదలయ్యాక కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తనపై చాలా ఏళ్ల కిందటే ..టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రౌడీషీట్ ఒపెన్ చేశారని…అయినా తాను ఏనాడు ఏ అధికారిని..చివరికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం కేసులు తీసేయించాలని కోరలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇప్పటికీ తనపై అనేక కేసులు మోపుతున్నారని పరోక్షంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యనించడం గమనార్హం. ఎవరెన్ని చేసిన నేను రాజకీయాల్లోనే ఉంటా..! ప్రజా సేవలోనే కొనసాగుతానంటూ మీడియా ప్రతినిధులతో పేర్కొనడం విశేషం.