నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అడుగులు బీజేపీ వైపు పడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది…
వైసీపీ అధిష్ఠానం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు ఆయన ప్రధాన అనుచరగణం కూడా పార్టీలో ఇమడలేమంటూ తేల్చేయడంతో ఆయన పార్టీ మార్పుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఏ అధికారిని కలవాలన్న పార్టీ అధినేత…లేదంటే ముఖ్య నేతలుగా చెలామణి అవుతున్న కొద్దిమందికి సమాచారం ఇవ్వాల్సి రావడం ఎంతో ఇబ్బందిగా ఉందని ఆయన పలుమార్లు తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటూ బాధపడ్డారట. వాస్తవానికి ఆయన నరసాపురం ఎంపీగా గెలవాలన్నది తన జీవిత కలగా ఎన్నికలకు ముందు చెప్పుకొచ్చారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.
అయితే వైసీపీకి నరసాపురంలో అంత పెద్దగా బలం లేకపోయిన తన సొంత ఇమేజ్‌తోనే అదీ సాధ్యమైందన్నది రాజుగారి వాదన. అంత కష్టపడి గెలిచినా పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన రగిలిపోతున్నారట. ఇక రాజకీయంగా చూసుకున్న వైసీపీకి తిరోగమన దశ మొదలవుతుందని ఆయన భావిస్తున్నారట. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే గుర్తింపుతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకత్వం వహించే అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం.
రాజుగారు పార్టీ మారబోతున్నట్లు పేర్లు కూడా బయటకు వస్తుండటంతో వైసీపీ ముఖ్య నేతల్లో కలవరం మొదలైందంట. టీడీపీ నుంచి నేతలు వైసీపీకి వస్తుంటే ఎంపీగా ఉన్న ఆయన బీజేపీకి వెళ్తే పార్టీ శ్రేణుల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయని ఆందోళన చెందుతున్నారట. ఎంపీతో స్వయంగా మాట్లాడి పార్టీ మారకుండా చూడాలన్నది ముఖ్యనేతల ఆలోచనగా తెలుస్తోంది.
ఆయన వెళ్లడం ఖాయమైతే కనుక వైసీపీ నుంచి మరిన్ని వలసలు ఊపందుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు టీడీపీని ఖాళీ చేసే పనిలో వైసీపీ ఉంటే, వైసీపీని ఖతం చేసే పనిలో బీజేపీ ఉందని చెబుతున్నారు.