ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు నెలల్లో ఈ జాతర షురూ కాబోతోంది. రెండేళ్లకోసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతరకు నాలుగు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభిస్తారు.
ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ఇంకా షురూ కాలేదు. మొత్తం 21 శాఖలు రూ.75 కోట్ల విలువైన ప్రతిపాదనలను జులైలోనే సిద్ధం చేసినా.. ఇప్పటికీ నిధులు కేటాయించలేదు. నిధుల విడుదలలో జాప్యం వల్ల పనులు ఇప్పటికీ మొదలు పెట్టలేదు.
జాతరలో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. జాతరకు 72 రోజులు మాత్రమే ఉన్నా.. ఇంకా పనులు మొదలుపెట్టకపోవడంతో జాతర సమయానికి భక్తులు ఇబ్బంది పడే అవకాశముంది.