వచ్చే ఏడాది జనవరి నెలాఖరు నాటికి 35 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అధికార వైకాపాను వీడే అవకాశాలు ఉన్నాయని నరసాపురం రఘురామకృష్ణ రాజు తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారని చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయడంతో వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకొద్దు బాబోయ్ అంటే… మాకొద్దని ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటున్నారంటే, వైకాపా మునిగిపోయే పడవని వారికి అర్థమైందని అన్నారు. ప్రజా తీర్పు అధికార వైకాపాకు వ్యతిరేకమని తేలడంతో, చిల్లుపడ్డ పడవ నుంచి దూకి ఒడ్డుకు చేరుకునేందుకు వారంతా ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోందని అన్నారు.
రాజకీయాల పట్ల సంపూర్ణ అవగాహన ఉండి ధైర్యం కలిగిన వారు వైకాపాను వీడేందుకు సిద్ధమవుతున్నారన్నారు. వైకాపా అధిష్టానం అరాచకాలు, శాసనసభ్యులను అగౌరవపరచడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి సంఘటనలు వారిని తీవ్రంగా కలిచి వేసి ఈ నిర్ణయానికి పురి గొల్పియాని అన్నారు.