ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతుంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికార వైసిపి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాకుండా తాజాగా చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాలలో చర్చనియాంశంగా మారింది. వీరిద్దరి భేటీ పై వైసీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
చంద్రబాబు – ప్రశాంత్ కిషోర్ ల భేటీ పై తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. టిడిపి – ప్రశాంత్ కిషోర్ ల కలయికను వైసిపి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఒక పీకే అక్కడ ఉన్నాడు.. ఇప్పుడు మరో పీకే వచ్చి చేరాడు.. అంతకుమించి ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. మాపై ఉన్న భయంతోనే చంద్రబాబు పీకే ని కలిశారని ఎద్దేవా చేశారు అప్పలరాజు. ఎన్నికలు అయిన తర్వాత జనసేన టిడిపిలో కలిసిపోవచ్చన్నారు.
ఎన్నికలలో విజయం సాధించడానికి వైసిపి చిన్న చిన్న మార్పులు చేస్తుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని మార్చుకుంటే తప్పులేదు కానీ.. మేము కోఆర్డినేటర్లను మార్చుకుంటే భయపడినట్లా..? అని ప్రశ్నించారు. సీఎం జగన్ అనుకున్న సమయానికి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు.