సమ్మెపై ఆర్టీసీ జేఏసీ వెనక్కు తగ్గింది… ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్దామ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎటు వంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమ్మెలో పాల్గొన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే సమ్మెను కొనసాగిస్తామని అశ్వత్దామ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా ఇదే కోరామని చెప్పిన ఆయన, కార్మికులు ఎలాంటి పేపర్ల మీద సంతకాలు చేయరని స్పష్టం చేశారు. విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్తే వెంటనే చేరతామన్నారు.
లేబర్ కోర్ట్ లో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నామని, 47 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె దిగ్విజయంగా నడుస్తుందన్నారు. విద్యానగర్ లోని ఎంప్లాయి యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసారు. సమస్యలని కార్మిక న్యాయస్థానం పరిష్కరిస్తుంది అని తాము భావిస్తున్నట్టు చెప్పిన ఆయన కోర్ట్ తీర్పుని తాము గౌరవిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం, యాజమాన్యం కూడా గౌరవించాలి అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆయన కోరారు.