తెలంగాణలో జనసేనతో బీజేపీ దోస్తీ కటీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికల రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం ఉండదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు పై కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందని అన్నారు. ఈ నెల 17న సుప్రీం కోర్టులో కేసు ఉందన్నారు. ఆ లోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తుందని, బీజేఎల్ పీ నేత ఎంపిక ఎప్పుడైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు.
మందకృష్ణ మాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశం చర్చకు రాలేదన్నారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పని చేస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపారని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో లీడర్ ఎవరో తెలియదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.