నిత్యావసరాల ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. మొన్నటి దాక కూరగాయల ధరలు అందుబాటులో లేక సామాన్యులు ముప్పుతిప్పలు పడ్డారు. ఇక ఇప్పుడు ఓవైపు కోడిగడ్డు.. మరోవైపు చికెన్ ధరలూ అమాంతం పెరిగిపోయాయి. ఇంకోవైపు బియ్యం ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం ధరలు రోజుకోలా పెరుగుతూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నవంబరు మొదటి వారంలో హెచ్‌ఎంటీ సోనా మసూరి బియ్యం కిలో రూ.65 ఉండగా డిసెంబరు నాటికి రూ.75 అయింది. మంగళవారం రోజున కిలో రూ.80 అయ్యింది.
పంట చేతికొస్తున్న సమయంలో ఆంధ్రాలో తుపానుతో వరి పంటలు కొట్టుకుపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్యాకింగ్, రవాణా ఛార్జీలతో క్వింటా రూ.6500 నుంచి రూ.7 వేల వరకూ అవుతోందని వాపోతున్నారు. రిటైల్‌లో కిలో రూ.75 నుంచి రూ.80 వరకూ ఉంటోందని.. జై శ్రీరామ్ రకం పాత బియ్యం క్వింటా రూ.7500 నుంచి రూ.8 వేలు ఉందని తెలిపార. విజయ మసూరి బియ్యం క్వింటా రూ.5900 నుంచి రూ.6300 వరకూ పలుకుతోందని చెప్పారు. మరోవైపు పెరుగుతున్న బియ్యం ధరలు చూస్తుంటే ఆకలి చచ్చిపోతోందని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.