హైదరాబాద్ లో మరో నూతన మార్గంలో మెట్రోకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో కొత్త మార్గంపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాథమికంగా కొంత స్పష్టత వచ్చింది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రోకు ప్రణాళికలు వేస్తున్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, పీ7 రోడ్ మీదుగా విమానాశ్రయానికి మార్గం మేలనే భావనలో మెట్రో నిపుణులున్నట్లు సమాచారం.
కారిడార్-2 కొనసాగింపుగా ఎంజీబీఎస్ – ఫలక్‌నుమా – చంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి – విమానాశ్రయం మార్గంతో పోలిస్తే కారిడార్-3 కొనసాగింపు నాగోల్ మార్గంలో ఎక్కువ మంది ప్రయాణిస్తారని అభిప్రాయాలున్నాయి. ఫలక్‌నుమా నుంచి వచ్చే మార్గం చంద్రాయణగుట్ట వద్ద ఇరుకుదారి కావడంతోపాటు ఫ్లైఓవర్ పైనుంచి మలుపు తీసుకుని నిర్మాణం చేపట్టడం అతిపెద్ద సవాల్‌తో కూడుకుందని అధికారులు భావిస్తున్నారు. అదే నాగోల్ నుంచి మార్గమైతే ఫ్లైఓవర్‌కు సమాంతరంగా వెళ్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఏ మార్గం ఏ మేరకు ఆర్థికంగా లాభసాటి అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటున్నారు.